పదవ తరగతి పరీక్షల్లోఫెయిల్ ఐనా విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆత్మవిశ్వాస పెంపు భవిష్యత్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన లక్ష్యంగా వరంగల్ జిల్లాలో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు జి హెచ్ ఎస్ నరేంద్రనగర్, జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు) నర్సంపేట పాఠశాలల్లో ఏర్పాటు చేయబడ్డాయి.మంగళవారం నాడు జి హెచ్ ఎస్ నరేంద్రనగర్ పాఠశాలలో సమ్మర్ క్యాంపును వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారికంగా ప్రారంభించారు.ఈ సమ్మర్ క్యాంపులో 70 మంది విద్యార్థులు గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్ ఖిలా వరంగల్ మండలాల నుండి విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరేంద్ర నగర్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుకి హాజరు కావటం జరిగింది.జిల్లా కలెక్టర్ సత్యశారద విద్యార్థులను ఉద్దేసించి మాట్లాడుతూ, ఎస్ఎస్ సిలో ఫెయిల్ అవడం జీవితంలో ఓటమి కాదని, అది మరింత బలంగా ముందుకు సాగేందుకు ఒక అవకాశం అని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుత్సాహానికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదువులో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని తెలిపారు.విద్యార్థుల మానసిక స్థైర్యం పెంపొందించేందుకు కౌన్సెలింగ్, ప్రత్యేక బోధన, సబ్జెక్టు వారీగా రిమీడియల్ క్లాసులు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమని, కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించగలరని ప్రోత్సహించారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ సమ్మర్ క్యాంపులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించబడినవని తెలిపారు. విద్యార్థులలో ఉన్న భయాలను తొలగించి, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందించబడుతుందని పేర్కొన్నారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహిస్తూ క్రమం తప్పకుండా క్యాంపులకు పంపించాలని కోరారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రతిరోజూ హాజరవుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ తరఫున అన్ని విధాల సహకారం అందించబడుతుందని తెలిపారు. సమ్మర్ క్యాంపుల్లో సబ్జెక్టు వారీగా ప్రత్యేక బోధనతో పాటు మోడల్ పరీక్షలు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు, సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు పాస్ అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే వచ్చే పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ క్యాంపలు 12 మే నుండి 3జూన్ వరకు ఉదయం 8.00 గంటల నుండి 12.00 గంటల వరకు నిర్వహించబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డిడబ్లుఒ రాజమణి, డి సి ఇ బి సెక్రటరీ కృష్ణమూర్తి ఎం ఇ ఒ జి హెచ్ ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు