ఆయుధం న్యూస్ హన్మకొండ
గ్రామీణ మహిళా సంఘాల సాధికారత, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి తెలిపారు.శనివారం హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) – సెర్ప్ కన్వర్జెన్స్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనం నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నాయని, వాటి కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత భవనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అదే ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, నాటిన మొక్కలను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలని గ్రామస్థులకు సూచించారు. కోగిల్వాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో మమేకమై వారి విద్యా పఠన సామర్ధ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు, వంటశాల నిర్వహణను తనిఖీ చేశారు. పిల్లలకు పోషకాహారం అందేలా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ఆత్మీయంగా మాట్లాడారు. కేంద్రంలో అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు, చిన్నారుల హాజరు, ఆరోగ్య పరిరక్షణ చర్యలను పరిశీలించారు. బాలల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలకమని పేర్కొంటూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీను, ఎంపీడీవో కల్పన , తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి, ఏపీఓ అశోక్, గ్రామ సర్పంచ్ చుక్క వనిత, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.