ఆయుధం న్యూస్ వరంగల్,
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రక కిలా వరంగల్ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 500 మంది విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.జిల్లా కలెక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో అవసరమని అన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని, అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి యోగ చాలా అత్యంత కీలకమని ప్రతి ఒక్కరూ జీవన విధానంలో యోగాకు 15 నిమిషాలు అవకాశం ఇచ్చి ఆరోగ్యని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.<span;>ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మైదం రాజు, డిప్యూటీ నోడల్ అధికారులు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలత, డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ మంజుల, జిల్లా కన్వీనర్ డాక్టర్ కె. రాజేందర్, ఆయుష్ శాఖ వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్ ఆర్డీఓ ఉమా, నర్సంపేట ఆర్డీఓ, డీఆర్వో విజయలక్ష్మి, డీపీఆర్వో ప్రేమలత, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి తదితరులు పాల్గొన్నారు. 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు వేస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్సీసీ కమాండెంట్ భాస్కర్ ధనరాజ్ నాయక్, పురావస్తు శాఖ అధికారి వంశీకృష్ణ, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, పాఠశాలల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.కాకతీయుల చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన ఖిలా వరంగల్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పిన కార్యక్రమంగా ఇది నిలిచింది.