ఆయుధం న్యూస్
హైదరాబాద్ లో ఆషాడ బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని అత్యంత శోభాయమానంగా, కన్నుల పండువగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎల్లమ్మ అమ్మవారు బల్కంపేటలో కొలువై వుండటం తెలంగాణ రాష్ట్రానికి మంగళప్రదం అని మంత్రి అన్నారు. జూలై 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవ సమన్వయ సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ అమ్మవారి దర్శనం చేసుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆషాడ బోనాల జాతర, ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం పోస్టర్ లను ఆవిష్కరించినారు ఈ సమావేశంలో ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖలకు అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు.బల్కంపేట దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఎదుర్కోలు ఉత్సవంతో వార్షిక కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతాయని, 21వ తేదీన ఉదయం 9 గంటలకు అత్యంత వైభవంగా అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారని, 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తులు వచ్చీపోయే మార్గలతో పాటు, క్యూలైన్లలో తోపులాట జరగకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని మంత్రి నిర్దేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విఐపి, వివిఐపిలకు కేటాయించిన ఎంట్రెన్స్ ల దగ్గర భద్రత పెంచడంతో పాటు వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా భక్తుల సందేహాలను తీర్చాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేలా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణ, కళ్యాణ మండపం, రథోత్సవ ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, వాలంటీర్ల నియామకం, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ఉత్సవాల విశిష్టతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.పోలీసు, ట్రాఫిక్ శాఖలు పటిష్టమైన బందోబస్తుతో పాటు ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, రద్దీ నియంత్రణ, క్యూ లైన్ నిర్వహణ, మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, శివసత్తులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు దిశగా శ్రధ్ద పెట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, చెత్త తొలగింపు, దోమల నివారణ, స్ట్రీల్ లైట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు, శానిటేషన్ ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలిక వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య బృందాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. బోనాల ఉత్సవాలు, కళ్యాణోత్సవం జరిగే మూడు రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు. అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోనాల ఉత్సవాల నిర్వహణలో పోలీసు శాఖ పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినదని మంత్రి అన్నారు. లక్షలాదిగా భక్తులు బల్కంపేట అమ్మవారి దర్శించుకునే పరిస్థితుల నేపథ్యంలో అనుమానితుల ఫోటోలు ప్రత్యేకంగా వాల్ పోస్టర్లుగా ప్రదర్శించాలని, తప్పిపోయిన పిల్లల జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యచరణను చేపట్టాలని సూచించారు.