AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 5:11 pm Posted by : AYUDAM DAILY

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ఆయుధం న్యూస్ హనుమకొండ,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ సమీక్షా సమావేశం గురువారం నాడు నిర్వహించారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం వందే మాతరం, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించారు.ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల చారిత్రక నేపథ్యం, అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య–ఆరోగ్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఇతర కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపడుతున్న భద్రత తదితర చర్యలను పోలీస్ కమిషనర్ శ్వేత వివరించారు.సమీక్ష సందర్భంగా టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం అమలు, టీబీ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, స్క్రీనింగ్ క్యాంపులు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, పల్స్ పోలియో కార్యక్రమం అమలు తీరుపై గవర్నర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

టీబీ నిర్మూలనకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలి….

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ టీబీ నిర్మూలనకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని, విస్తృత స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం లక్ష్యంతో అమలయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులతో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించామని పేర్కొన్న గవర్నర్, పరిపాలనలో ఎదురయ్యే చిన్నచిన్న లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. జిల్లాల అభివృద్ధికి జిల్లా పరిపాలన, పోలీసు శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.సమీక్షలో సమర్పించిన వివరాలను పరిశీలిస్తే ప్రతి రంగంలో మరింత నాణ్యత, సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న గవర్నర్, ఈ ప్రాంతం పత్తి సాగుకు ప్రసిద్ధి చెందినందున రైతులను అధిక ఆదాయం వచ్చే పంటల సాగు, విలువ ఆధారిత వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు.పాలనలో పారదర్శకత అత్యంత కీలకమని, పారదర్శక వ్యవస్థ వల్ల ప్రజలకు, రైతులకు, ప్రభుత్వానికి సమానంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

కృత్రిమ మేధస్సుతో భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దానిని భయపడాల్సిన అవసరం లేదు….

ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) యుగంలోకి అడుగుపెట్టిందని పేర్కొంటూ, ఏఐ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోందన్నారు. భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దానిని భయపడాల్సిన అవసరం లేదని, ఏఐని మనిషి సృష్టించాడనే విషయాన్ని గుర్తుంచుకొని, దానిని సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించుకుని పరిపాలన, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.ప్రతి శాఖ సమన్వయంతో, ప్రతి రంగానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు.వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో అత్యవసర మౌలిక వసతులు, మరమ్మతులు, డ్రైనేజీ తదితర పనుల కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి హాస్టల్‌లో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వేడి నీటి సదుపాయం, డ్రైనేజీ నిర్వహణ, విద్యుత్ భద్రత, వంటశాలలు, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పైకప్పుల లీకేజీలు, దెబ్బతిన్న భవనాలు, నీటి సరఫరా, డ్రైనేజీ తదితర పెండింగ్ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.హాస్టళ్లలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధులు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సామగ్రి, అత్యవసర వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.అత్యవసర నిధులను పారదర్శకంగా, అవసరాలకు అనుగుణంగా వినియోగించి, విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్లను ఆదేశించిన మంత్రి, “హాస్టళ్లలో చదువుతున్న ప్రతి విద్యార్థి భద్రత, ఆరోగ్యం, విద్యా ప్రగతి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం” అని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారునికి చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేసి, హనుమకొండ, వరంగల్ జిల్లాలను అన్ని రంగాల్లో ఆదర్శ జిల్లాలుగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో హనుమకొండ జిల్లాల ఆదనవు కలెక్టర్లు రవి సంధ్యారాణి, వరంగల్ డీసీపీ ధారా కవిత, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు