AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:11 pm Posted by : ayudam desk

ప్రభుత్వ సేవల నాణ్యత పెంపునకు అధికారులు ఏఐ సాధనాలను వినియోగించాలి

ఆయుధం న్యూస్ హనుమకొండ,:
ప్రభుత్వ పరిపాలనలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence–AI) వినియోగం ద్వారా కార్యనిర్వహణను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించవచ్చని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో టీ-ఫైబర్ సహకారంతో ప్రభుత్వ అధికారుల సామర్థ్యాభివృద్ధి లక్ష్యంగా “పరిపాలన సామర్థ్య పెంపునకు కృత్రిమ మేధస్సు (AI)” అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రభుత్వ పరిపాలనలో వినియోగించడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. రోజువారీ కార్యాలయ కార్యకలాపాల్లో ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగిస్తే తక్కువ సమయంలో నాణ్యమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.ఒక అధికారిక లేఖను రూపొందించడానికి గతంలో ఎక్కువ సమయం పట్టేది. అయితే ఏఐ సాధనాల సహాయంతో అదే పనిని కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చని అన్నారు. అలాగే ఆకర్షణీయమైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, అధికారిక నివేదికలు, సమావేశాల మినిట్స్, కార్యాలయ లేఖలు, పత్రాల సంక్షిప్తీకరణ, అనువాదాలు వంటి అనేక పనులను సులభంగా నిర్వహించవచ్చని వివరించారు.ఏఐ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని, పనిని వేగవంతం చేసే సహాయక సాధనం అని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారుల సామర్థ్యాన్ని మరింత పెంచి, సమయాన్ని ఆదా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్స్ వెండింగ్ జోన్ ఏర్పాటు కోసం రూపొందించాల్సిన డీపీఆర్ కు కన్సల్టెన్సీ సంస్థలు భారీ మొత్తంలో రుసుము కోరిన సందర్భంలో, ఏఐ సాధనాల ద్వారా అవసరమైన సమాచారాన్ని విశ్లేషించి ఉచితంగా డీపీఆర్ రూపొందించగలిగామని తెలిపారు. దీనివల్ల సాధారణంగా వారం రోజుల సమయం పట్టే పనిని కొద్ది గంటల్లో పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ నిధులను కూడా ఆదా చేయగలిగామని చెప్పారు.ఈ శిక్షణలో భాగంగా *చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ నోట్‌బుక్ ఎల్‌ఎమ్ (Google NotebookLM), క్లాడ్ (Claude)*తో పాటు మొత్తం 15 అధునాతన ఏఐ ఆధారిత ఉత్పాదకత సాధనాల వినియోగంపై శిక్షణ అందించారు.అధికారిక లేఖల తయారీ, సమావేశాల మినిట్స్ రూపొందించడం, పత్రాల సంక్షిప్తీకరణ, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం, వచనాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, వర్డ్ పత్రాలుగా రూపొందించడం, సమాచార సేకరణ (రిసెర్చ్), డేటా విశ్లేషణ, రోజువారీ కార్యాలయ పనులను స్వయంచాలకంగా నిర్వహించే విధానాలపై పాల్గొన్న అధికారులకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు.
శిక్షకులు వాసుదేవన్ నటరాజన్ ,ధీరజ్ ఏఐ సాధనాల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనలు (Hands-on Demonstrations) నిర్వహిస్తూ, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిపాలనా వ్యవస్థలో వాటి వినియోగం, ప్రయోజనాలను వివరించారు.ప్రభుత్వ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఏఐ ఆధారిత సాధనాల ద్వారా వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన పత్రాల నిర్వహణ, పునరావృత పనులకు వెచ్చించే సమయం తగ్గడం, ఖచ్చితత్వం, ఉత్పాదకత పెరగడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పాల్గొని కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతను ప్రభుత్వ పరిపాలనలో వినియోగించే విధానాలపై అవగాహన పొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏవో గౌరీశంకర్, డి సెక్షన్ సూపరింటెండెంట్ నాగరాజు, పలువురు జిల్లా అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.