AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 2:47 pm Posted by : AYUDAM DAILY

అమెరికాలో ఉన్నా మనసంతా తెలంగాణ‌ అన్నదాతలపైనే

ఆయుధం న్యూస్ ములుగు
అమెరికా తెలంగాణ అసోసియేషన్ (TTA) సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అక్కడ ఉన్నప్పటికీ తన మనసంతా తెలంగాణ రైతులపైనే ఉందని మరోసారి చాటిచెప్పారు.తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగు పరిస్థితులపై ములుగు రైతులతో మంత్రి సీతక్క ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చెరువుల పరిస్థితి, విత్తనాల విత్తకం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.రైతులతో మాట్లాడిన సందర్భంగా, ఇప్పుడే వర్షాకాలం ప్రారంభమైందని, రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఎలాంటి పంటలు సాగు చేయడం మంచిదో, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక ఎలా ఉండాలో మంత్రి సీతక్క రైతులకు సూచనలు చేశారు.వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “జలసిరి” కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపడితే భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. నీటి సంరక్షణలో ప్రతి రైతు, ప్రతి గ్రామం భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఎక్కడ ఉన్నా రైతు సంక్షేమమే తన తొలి ప్రాధాన్యమని, తెలంగాణ అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.