ఆయుధం న్యూస్ హన్మకొండ
గ్రేటర్ వరంగల్ నగరంలోని పార్కులు, వైకుంఠధామాలను పరిశుభ్రంగా, ప్రజలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులు ఫోకస్ పెట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం కమిషనర్ నగరంలోని పలు పార్కులు, వైకుంఠధామాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ ..
హనుమకొండ బాలసముద్రం 30వ డివిజన్ లోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ను సందర్శించిన కమిషనర్, పార్కులో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నెల 6న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జయంతి నాటికి పార్కు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించిన కమిషనర్, మిగిలిన పనులను దశలవారీగా వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పార్కులో హరితీకరణ విస్తరణ, నడక మార్గాల నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పరిశుభ్రత, సందర్శకులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
54వ డివిజన్ పోచమ్మకుంటలోని వైకుంఠధామంతో పాటు 57వ డివిజన్ టీవీ టవర్ ప్రాంతంలోని వైకుంఠధామాన్ని సందర్శించిన కమిషనర్ అక్కడి నిర్వహణ తీరును సమీక్షించారు. వైకుంఠధామాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ, హరితీకరణ, మొక్కల సంరక్షణ, అంతర్గత రహదారుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైకుంఠధామాల నిర్వహణను అత్యుత్తమ ప్రమాణాలతో కొనసాగించాలని, నగరంలోని పార్కులు, వైకుంఠధామాలు పరిశుభ్రత, పచ్చదనం, సౌకర్యాల పరంగా ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో కార్యక్రమంలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ హరి తదితర అధికారులు పాల్గొన్నారు.