AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:46 pm Posted by : AYUDAM DAILY

స్టేషన్‌ ఘన్‌పూర్ లో మెగా లెదర్‌ పార్క్‌కు కేంద్రం ప్ర‌భుత్వం వెంటనే ఆమోదించాలి: వరంగల్ ఎంపీ కావ్య

ఆయుధం న్యూస్ న్యూ డిల్లీ
జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్‌ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కోరారు. బుధవారం లోక్‌సభలో రూల్‌-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఉపాధి కల్పనకు దోహదపడే కీలక ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ప్రభుత్వ గుర్తించిన 120 ఎకరాల్లో తెలంగాణ స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎల్‌ఐపీసీఓ) ఆధ్వర్యంలో మెగా లెదర్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో లెదర్‌ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతతో పాటు ఎఫ్‌డీడీఐ, నిఫ్ట్‌, గిల్ట్‌ వంటి సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందని వివరించారు.ఈ ప్రాజెక్టు అమలైతే ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నారు. ఉపాధి కల్పనకు దోహదపడే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖను వరంగల్ ఎంపీ కావ్య కోరారు.