ఆయుధం న్యూస్ న్యూడిల్లీ
వరంగల్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), రైల్వే అండర్ బ్రిడ్జిలు (RUBలు), లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు పనుల పురోగతిపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య లోక్‌సభలో కీలక ప్రశ్న లేవనెత్తారు. గత ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో ఆమోదించిన ROBలు, RUBలు,లెవల్ క్రాసింగ్‌ల నిర్మూలన పనుల వివరాలు, వాటి వ్యయం, నిధుల విధానం, ప్రస్తుతం పనుల పురోగతి, ఖర్చు చేసిన నిధులు, పూర్తయ్యే గడువు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వరంగల్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈమేరకు 2026 జూన్ 1 నాటికి వరంగల్ జిల్లాలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు, 8 లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో 4 ROB/RUB పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.వాటిలో వరంగల్– చింతలపల్లి మధ్య లెవల్ క్రాసింగ్ నెం.64 వద్ద రూ.77 కోట్లతో ROB నిర్మాణానికి టెండర్ ఖరారైందన్నారు. అలాగే కాజీపేట–వరంగల్ మధ్య లెవల్ క్రాసింగ్ నెం.60, ఎల్గూర్–నెక్కొండ మధ్య లెవల్ క్రాసింగ్ నెం.66, 67 వద్ద మరో మూడు ROBలను రాష్ట్ర ప్రభుత్వమే తన స్వంత నిధులతో చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 ROB/RUB పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ROB, RUB పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా టెండర్ పూర్తయిన పనులు, GAD దశలో ఉన్న ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు ROBల నిర్మాణానికి కూడా రైల్వే శాఖ పూర్తి సహకారం అందించాలని సూచించారు. వరంగల్ జిల్లా ప్రజలకు సురక్షితమైన, అంతరాయం లేని రవాణా సౌకర్యం కల్పించేందుకు పార్లమెంట్‌లో తన ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు.