AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 1:08 pm Posted by : AYUDAM DAILY

తెలంగాణ‌లో రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయ‌లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
పేదల సంక్షేమం, రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి 3.25 కోట్ల రూపాయ‌ల‌ అంచనా వ్యయంతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న తహశీల్దార్ కార్యాలయ భవనానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో మండలాలు ఉన్నా కార్యాలయ భవనాలు లేక ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి సుమారు రూ.600 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 180 తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతులు, భూ యజమానులకు భూములపై సంపూర్ణ హక్కులు, భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన విధానంలో భూభారతి ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. భూ పరిపాలనలో మరిన్ని సంస్కరణలను కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి భూ పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు భౌగోళిక కోఆర్డినేట్స్‌తో కూడిన మ్యాప్‌ను రూపొందించి అందించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.రైతులు, ప్రజల సహకారంతో భూ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేసి భవిష్యత్తులో భూములకు సంబంధించి వివాదాలు, సమస్యలు తలెత్తకుండా శాశ్వత భూ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఎల్కతుర్తి సమగ్ర అభివృద్ధికి కృషి : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండల ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.ఎల్కతుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు. మండలానికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అదేవిధంగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆర్టీఓ కార్యాలయ భవన పనులను పూర్తిచేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఎల్కతుర్తి ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుని మండలాన్ని మరింత ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ కార్యాలయానికి అవసరమైన అదనపు నిధులను ఈ వారంలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ రవి, ఎన్పి డిసిఎల్ ఎస్ ఈ సామ్య నాయక్ , స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.