ఆయుధం న్యూస్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ తోటను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై అద్భుతమైన దిగుబడి సాధిస్తున్న రైతులను ఆయన అభినందించారు.ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలను, అక్కడి రైతుల ఉన్నతమైన జీవనశైలిని చూసినప్పుడు.. సిద్దిపేట రైతులు కూడా ఇలాగే ఆర్థికంగా ఎదగాలని తాను బలంగా కోరుకున్నానని హరీశ్ రావు గారు గుర్తుచేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చినప్పటికీ, అంతా వరి పంటే వేయడం వల్ల రైతుల ఆదాయంలో పెద్దగా మార్పు రాలేదన్నారు. సిద్దిపేటలో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిపుణులను అడిగినప్పుడు మొదట ఇక్కడ గాలిలో తేమ లేదని చెప్పారని, కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, చెక్ డ్యామ్ లు నిండిన తర్వాత తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ధారించారని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఈ అద్భుతం సాధ్యమైందన్నారు.

జూన్ 5, 2021న నంగునూరులో ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి మొక్క నాటగా, సరిగ్గా మూడేళ్ల తర్వాత జూన్ 15, 2024న అక్కెనపల్లిలో నాగేందర్ అనే రైతు పొలంలో మొదటి గెల కోశారని హరీశ్ రావు తెలిపారు. మొదటి గెల కోసి, ఫ్యాక్టరీకి పంపిన కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంతో అందరిలో నమ్మకం కుదిరిందన్నారు.ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో 5,322 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, 301 ఎకరాల్లో కటింగ్ మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు. నంగునూరు 2750 ఎకరాలతో మొదటి స్థానంలో, చిన్నకోడూరు 1050 ఎకరాలతో రెండో స్థానంలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో దీనిని 50 వేల ఎకరాలకు విస్తరించి, రాష్ట్రానికే సిద్దిపేటను దిక్సూచిగా మారుస్తామన్నారు.నియోజకవర్గంలో మొత్తం లక్షా 2 వేల ఎకరాల సాగు భూమి ఉంటే, అందులో 88 వేల ఎకరాల్లో కేవలం వరి మాత్రమే పండిస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పండిస్తే ఏడాదికి 50 వేల రూపాయలు కూడా మిగలని పరిస్థితి ఉంటే.. కేవలం రెండు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న మహేందర్ అనే రైతు నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తున్నాడని ఆయన సగర్వంగా చెప్పారు.తాను పరిశీలించిన పాపిరెడ్డి 10 ఎకరాల తోటలో ఆరు నెలలకే 26 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని, ఎకరానికి 8 టన్నుల చొప్పున, టన్నుకు 24 వేల రూపాయల ధర పలుకుతోందని వివరించారు. ఖర్చులు పోను ఎకరానికి సగటున లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తోందని, గోపాలాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఉద్యోగం మానేసి 5 ఎకరాల్లో సాగు చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడని స్ఫూర్తిదాయక ఉదాహరణలు చెప్పారు.ఆయిల్ పామ్ కేవలం రైతుకు మాత్రమే కాకుండా సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని హరీశ్ రావు వివరించారు. ఈ చెట్ల వల్ల ఆక్సిజన్ పెరుగుతుందని, తోటలు ఉన్న ప్రాంతంలో సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని, వర్షాలు బాగా కురుస్తాయని తెలిపారు.మామిడి తదితర పండ్ల తోటల్లాగా వడగళ్ల వానలకు, గాలి దుమారాలకు ఈ పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదని, కోతుల బెడద అసలే ఉండదని స్పష్టం చేశారు. భారతదేశం ఏటా లక్ష కోట్ల రూపాయల వంట నూనెను రష్యా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, మనమే ఆయిల్ పామ్ పండిస్తే ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి ఆదా చేసిన వాళ్లం అవుతామని ఆయన గర్వంగా చెప్పారు.సొంత నియోజకవర్గంలో ఆయిల్ పామ్ సాగును మరింత ప్రోత్సహించేందుకు గోద్రెజ్ కంపెనీ అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని హరీశ్ రావు తెలిపారు. సాగు కోసం గుంతలు తీసుకుని ఎదురుచూస్తున్న వెయ్యి ఎకరాల కోసం, వారం రోజుల్లో 30 వేల నుంచి 40 వేల మొక్కలు తెప్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తక్కువ ఎత్తు పెరిగి, ఎక్కువ దిగుబడినిచ్చే సరికొత్త సిరాయిడ్ వెరైటీ మొక్కలు కూడా చందలాపూర్ నర్సరీలో సిద్ధమవుతున్నాయని, మరో నాలుగు నెలల్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే సిద్దిపేటలో ఫ్యాక్టరీ పూర్తయిందని, మరో మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వ రంగంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే ప్రారంభం కాబోతోందని శుభవార్త చెప్పారు. పండిన గెలలను నూనెగా మార్చి, ప్యాకెట్ల రూపంలో ఇక్కడి నుంచే దుకాణాలకు సరఫరా చేసే స్థాయికి సిద్దిపేట ఎదుగుతోందని హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు కేవలం రోడ్లు, భవనాలకే పరిమితం కాకుండా రైతుల ఆదాయం పెంచే ఇటువంటి పంటల వైపు యువతను, రైతులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.