AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:45 pm Posted by : AYUDAM DAILY

ఆగస్టు 12 నుండి ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026 ప్రారంభం

ఆయుధం న్యూస్ విజ‌య‌వాడ‌
ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ, అవగాహన 95-95-99 లక్ష్యాల సాధన దిశగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీఎస్ఎసిఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 12 నుండి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “ఇంటెన్సిఫైడ్ ఐసిటిసి క్యాంపెయిన్-2026” నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. స్మరణ్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాడేపల్లి కార్యాలయం నుండి ఈ కార్యక్రమ వివరాలను వెల్లడిస్తూ, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 12న ప్రారంభమయ్యే ఈ ప్రచారం ఆగస్టు నెల అంతా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా హెచ్ఐవి పట్ల ప్రజా బాధ్యతను పెంచడం, హెచ్ఐవి మరియు సిఫిలిస్ పరీక్షలను వేగవంతం చేయడం, గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం మరియు హెచ్ఐవి బారిన పడిన వారికి ఎటువంటి వివక్ష లేకుండా మెరుగైన రోగనిరోధక చికిత్సలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. మల్టీసెక్టోరల్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ, గిరిజన, యువజన సంక్షేమ, కార్మిక శాఖలతో పాటు ఎన్వై కేఎస్,ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి మరియు నెట్‌వర్క్ సంఘాల సమన్వయంతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, కళాజాతాలు మరియు ప్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
“అవగాహన – పరీక్ష – చికిత్స – ఆరోగ్యకరమైన సమాజం” అనే ప్రధాన నినాదంతో సాగే ఈ ప్రచారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవిని ప్రారంభ దశలోనే గుర్తించడం, క్రమం తప్పకుండా చికిత్స పొందడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని, హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారిని సాదరంగా సమాజంలోకి ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఐవి/ఎయిడ్స్ కి సంబంధించిన ఉచిత సమాచారం, సలహాలు మరియు సహాయం కోసం జాతీయ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1097 ను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెకర్ బి. స్మరణ్ రాజు విజ్ఞప్తి చేశారు.