AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 7:48 pm Posted by : AYUDAM DAILY

ఆగస్టు 15లోగా ఒక యూనిఫామ్, 30లోగా మరో యూనిఫామ్ అందించాలి:

ఆయుధం న్యూస్ హనుమకొండ
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను, మహిళా సంఘాల ప్రతినిధులను ఆదేశించారు.మంగళవారం పరకాల మండలం నాగారం గ్రామంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కేటాయించిన పాఠశాల యూనిఫామ్‌ల కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని యూనిఫామ్‌లు కుట్టారు, వస్త్రం నాణ్యత ఎలా ఉంది, కుట్టు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది తదితర వివరాలను మహిళా సంఘాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కుట్టిన యూనిఫామ్‌లను స్వయంగా పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందించే యూనిఫామ్‌లు నాణ్యమైన వస్త్రంతో, కొలతలకు అనుగుణంగా, చక్కటి కుట్టుతో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా ఒక యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 30లోగా రెండో యూనిఫామ్‌ను కూడా అందించే విధంగా కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లు అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పరిశీలించారు. కేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, మధ్యాహ్న భోజనం చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, పిల్లలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ఈ పర్యటనలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్‌డీఓ మేన శ్రీను, జడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రామకృష్ణ, నాయబ్ తహసీల్దార్ ఆరేపల్లి సుమన్, డీపీఎం రాజేంద్రప్రసాద్, గ్రామ సర్పంచ్ రమాదేవి, ఇతర అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.