AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 5:55 pm Posted by : AYUDAM DAILY

హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్:

పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలలో అత్యున్నత పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న నిర్వాహకులను ఆదేశించారు.బుధవారం వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో ఉన్న హరే కృష్ణ ఫౌండేషన్ ప్రధాన వంటశాలను, అనంతరం నూతనంగా నిర్మించిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల నిర్వహణ, ఆహార తయారీ విధానం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్యాకింగ్ తదితర అంశాలపై నిర్వాహకులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

వంటశాల పరిసరాలు, బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. వంట పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఆహార పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేయాలని సూచించారు. వంట తయారీలో పాల్గొనే సిబ్బంది శుభ్రమైన దుస్తులు, గ్లౌజులు, హెడ్ క్యాప్‌లు తప్పనిసరిగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు అందించే భోజనం నాణ్యతతో పాటు రుచికరంగా, పరిశుభ్రంగా, వేడిగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆహార తయారీ నుంచి ప్యాకింగ్, పంపిణీ వరకు ప్రతి దశలో పరిశుభ్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వంటశాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని, పరిసరాల్లో ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వంటశాల నిర్వాహకులు డ్రెయిన్ ఔట్‌ఫ్లో సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కచ్చా డ్రెయిన్ ఏర్పాటు చేసి నీటి పారుదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.ఈ తనిఖీల్లో ముఖ్య ఆరోగ్యాధికారి డా. రాజారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డా. రాజేష్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఇంజనీరింగ్ అధికారులు, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.