AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:54 pm Posted by : AYUDAM DAILY

అవయవ దానం ఒక గొప్ప సామాజిక బాధ్యత.

ఆయుధం న్యూస్ హన్మకొండ
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ అన్నారు.అవయవ దాన దినోత్సవం* ” సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి-సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఏ.ప్రదీప్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ “మనిషి మరణించిన తరువాత కూడా మరొకరి జీవితంలో వెలుగును నింపగలగడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి ఉండదు అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్ల వంటి అవయవాలను అవసరమైన వారికి అందించడం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. న్యాయసేవాధికర సంస్థ కార్యదర్శి-సీనియర్ సివిల్ జడ్జి ఎ. ప్రదీప్ మాట్లాడుతూ “న్యాయ సేవా సంస్థల పరంగా కూడా ప్రజలకు వారి చట్టపరమైన హక్కులు, అవయవ దానానికి సంబంధించిన విధానాలు మరియు కుటుంబ సభ్యుల పాత్ర గురించి అవగాహన కల్పించే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజా సమూహాల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అని దీనికి ప్రతి ఒక్కరి సహకారం అందించాలని కోరారు.
వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి.హెచ్.ఉపేందర్ మాట్లాడుతూ “ఒకరి జీవితానికి ముగింపు వచ్చినా, మరొకరి జీవితానికి కొత్త ఆరంభం ఇవ్వవచ్చునని తెలిపారు.
కే.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ మాట్లాడుతూ “అవయవ దానం – మరణం తర్వాత కూడా జీవించే మానవత్వం” అనే భావనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అని వివరించారు.
రీజనల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ” మన సమాజంలో అవయవ దానం గురించి ఇంకా అనేక అపోహలు, భయాలు ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది అవసరమైన అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు అని తెలిపారు. అందువల్ల అవయవ దానం గురించి శాస్త్రీయమైన మరియు వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా సూచించారు. ఈ సందర్భంగా లఘు చిత్రాలను ప్రదర్శింపజేసి సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులకు వివరించారు. యం.జి.యం.హాస్పిటల్ ఆర్.యం.ఓ.డాక్టర్ సనత్ రోషన్ మాట్లాడుతూ “ఒక మంచి నిర్ణయం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వవచ్చు. ఒక తల్లిదండ్రికి తమ బిడ్డను తిరిగి చూడగల అవకాశాన్ని ఇవ్వవచ్చు. ఒక చిన్నారికి భవిష్యత్తును అందించవచ్చు. కాబట్టి, అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహనను పెంపొందించేలా కార్యాచరణను రూపొందించాలని అధికారులను కోరారు.
రిటైర్డు హెడ్ మాస్టర్ మరియు అవయవ దాన అసోసియేషన్ ప్రెసిడెంట్ కోన్.మల్లారెడ్డి “అవయవ దానం కేవలం వైద్యపరమైన అంశంతో పాటు ఇది మానవత్వం, దాతృత్వం మరియు సామాజిక బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న న్యాయవాదులచే “మరణించిన తరువాత కూడా ఎవరికైనా జీవించే అవకాశం కల్పించాలని, “అవయవ దానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం – మానవత్వాన్ని చాటుదాం” అని ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, డాక్టర్లు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.