ఆయుధం న్యూస్ జనగామ
పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శనివారంజనగామ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, జనగామ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బూష పర్వతాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్, జనగామ, బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు, జనగామ ఎల్. ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యులు ఎల్. లక్ష్మీనారాయణ నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరై, తెలంగాణ రాష్ట్ర గీతావళిని ఆలపించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు.రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపై నుంచే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు.మూడో విడత, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసి, తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని చెప్పారు.గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి, లబ్ధిదారులకు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నివాసయోగ్యంగా అందిస్తామని తెలిపారు.జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58–60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నామని, వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు.నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14–15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఈ కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేసిందన్నారు.ప్రజాపాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇంకా రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుల భారం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన పేదలకే ఇళ్లు అందించాలన్నారు. అర్హత లేని వారు ఉంటే తొలగించి, నిజమైన అర్హులకు అవకాశం కల్పించాలన్నారు.ఈ క్రమంలో జనగామ శాసనసభ్యులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో జనగామ మున్సిపాలిటీ అత్యంత పురాతన మున్సిపాలిటీ అని పేర్కొంటూ, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు.ఏడు నెలల క్రితం జనగామ మున్సిపాలిటీ పరిధిలో రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా వడ్లకొండ–శామీర్‌పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయాలని కోరారు. అలాగే చీటకోడూరు బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని, గండిరామారం పంపులను మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు.అలాగే రెండో దశలో అదనంగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసి, అందించాలన్నారు. అనంతరం జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. 2008 సంవత్సరం నుంచి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చీటకోడూరు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆయా ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఈ పనుల ద్వారా జనగామ మున్సిపాలిటీని అందరికీ ఆదర్శప్రాయమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.తదనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.