ఆయుధం న్యూస్ హన్మకొండ
హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి (గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ) లోని వివిధ విభాగాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు చేసి గర్భిణీలు, బాలింతలు, మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రిలోని వసతులను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు. వైద్య సేవల నిమిత్తం అక్కడికి వచ్చిన గర్భిణీ, బాలింతలతో కలెక్టర్ మాట్లాడి అందుతున్న వైద్య సేవలపైన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఓపీ సేవలు, ఆరోగ్య మహిళా క్లినిక్, ఫెర్టిలిటీ క్లినిక్, ల్యాబొరేటరీ, గైనకాలజీ ఓపీ, స్కానింగ్ గది, స్టోర్ రూమ్, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఓపీ రిజిస్టర్లు, ల్యాబ్ రికార్డులను తనిఖీ చేశారు. ఓపీ వివరాలను ఆన్ లైన్ చేస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు, గర్భిణులకు సంబంధించిన వివిధ పరీక్షల వివరాలు, నమూనాల సేకరణ విధానం, టెస్ట్ రిపోర్ట్ అందించే సమయం గురించి వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, ఎంతమంది వైద్యుల అందుబాటులో ఉంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్ రూమ్‌లో పరికరాల పనితీరు, టెస్ట్ రిపోర్ట్స్ ఇచ్చే విధానాన్ని పరిశీలించారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్‌లలో ఉన్న ఏర్పాట్లు, శుభ్రత, పరికరాల నిర్వహణపై ఆరా తీశారు. స్టోర్ రూమ్‌లో మందుల నిల్వలు, వైద్య పరికరాలు, శస్త్రచికిత్స సామగ్రి, వినియోగ వస్తువుల నిల్వలను పరిశీలించారు.ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, విధుల కేటాయింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చే గర్భిణులు, బాలింతలు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆరోగ్య పరీక్షల రిపోర్ట్ లను వీలైనంత త్వరగా అందించాలని సూచించారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న అన్ని పరీక్షల రిపోర్టులను జాప్యం లేకుండా ఇవ్వాలన్నారు. ప్రసూతి, వైద్య సేవల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. అవసరమైన మందులు, సామగ్రి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ ప్రాంగణం, ల్యాబ్, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఆసుపత్రి ఆవరణ నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్బంగా..ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, డ్యూటీ డాక్టర్ లు కలెక్టర్ కి ఆసుపత్రి వివరాలను అలాగే అందిస్తున్న వైద్య సేవల గురించి కలెక్టర్ వివరించారు