AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:58 pm Posted by : AYUDAM DAILY

యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఆయుధం న్యూస్ ములుగు
యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను మంత్రి పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో నేరుగా మాట్లాడి, వారి చదువు, శిక్షణా విధానం, వసతి సౌకర్యాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అభ్యర్థులు లక్ష్యంపై దృష్టి సారించి, క్రమశిక్షణతో శిక్షణ పొందాలని సూచించారు. ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించి, తదుపరి దశల్లోనూ ప్రతిభ కనబరిచి పోలీస్ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. అభ్యర్థుల విజయానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీఎస్పీ రవీందర్, ఆర్‌ఐ, సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.