ఆయుధం న్యూస్ హన్మకొండ వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా విద్యా, వైద్య రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన వరంగల్‌ను క్రీడా రంగంలోనూ దేశస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అధికారిక మస్కట్ ‘నీలమణి’ పోస్టర్‌ను సమావేశ మందిరంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి ఎంపీ కడియం కావ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా, మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్ హబ్‌గా కూడా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇందుకోసం ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్, స్పోర్ట్స్ స్టేడియం మంజూరు చేయడంతో పాటు ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణకు వరంగల్‌కు అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు.దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు ప్రతిభను చాటుకునేందుకు ఖేలో ఇండియా వేదిక కల్పిస్తోందని, ఇలాంటి ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల నిర్వహణ వరంగల్‌కు దక్కడం ఈ ప్రాంత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను గతంలో నిర్వహించిన పోటీల కంటే మరింత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. క్రీడాకారులకు అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాలు, రవాణా, భద్రత, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణతో వరంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు స్థానిక యువతలో క్రీడల పట్ల ఆసక్తి, క్రీడా ప్రతిభ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం వరంగల్ ప్రజలందరికీ గర్వకారణమని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాలు, ప్రజలు సమష్టిగా సహకరించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను హనుమకొండలో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళగా వెంటనే స్టేడియం, స్పోర్ట్స్ స్కూలు మంజూరు చేశారని అన్నారు. జాతీయస్థాయి పోటీలను నిర్వహించే అవకాశం జిల్లాకు లభించడం గొప్ప విషయమని అన్నారు. క్రీడల నిర్వహణకు వచ్చిన అవకాశంతో జాతీయస్థాయిలో జిల్లా మంచి గుర్తింపు పొందే విధంగా సమన్వయంతో క్రీడల విజయవంతానికి కృషి చేయాలని కోరారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఎనిమిదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలను హనుమకొండ జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్పోర్ట్స్, గేమ్స్ కు వరంగల్ నిలయంగా ఉందని, జిల్లాకు ఎంతో పేరు ఉందని అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమన్వయంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలమంతా కలిసి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం సెల్ఫీ పాయింట్ వద్ద ఎంపీ, ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ రవి, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, తదితర అధికారులతో పాటు అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ యాదవ్, టెన్నీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు