భూపాలపల్లి, ఆయుధం: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగానికి చేసిన కృషిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఆజాద్ గ్రామీణ పేదలు, బాలికలకు విద్య, వయోజన అక్షరాస్యత, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి, సార్వత్రిక ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, వృత్తిపరమైన శిక్షణతో సహా వివిధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం, గతేడాది మొదటి సంవత్సరం బైపీసీ గ్రూపులో మైనారిటీ కళాశాల నుండి అత్యధిక మార్కులు సాధించిన సాయి తేజ, వసిం అహ్మద్ లకు ఎమ్మెల్యే జ్ఞాపిక లను అందించి, శాలువా కప్పి సన్మానం చేశారు.