Thursday, April 3, 2025

E-Paper

Homeలేటెస్ట్ఐనవోలు జాతరను నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయండి -వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు

ఐనవోలు జాతరను నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయండి -వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు

ఆయుధం హనుమకొండ: ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు లోని శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణ ఫై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుండి జాతరకు ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యుత్ శాఖ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను చేయాలన్నారు. రోడ్ల మరమ్మతు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపుల పెరిగిన చెట్లను తొలగించాలన్నారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్త్ నిర్వహించాలని అన్నారు. జాతర కు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే మహిళా భక్తులకు స్నానపు గదులు, టాయిలెట్స్ సరిపోను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. తగినన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. జాతర లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మినీ వెహికల్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఐనవోలు జాతర ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వీఐపీ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. జాతర లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఆలయంలో
శాశ్వత నిర్మాణాలకు నిధులు తీసుకువస్తానని, చారిత్రక ఆలయం కాబట్టి పురావస్తు అధికారులతో మాట్లాడి అభివృద్ధి కి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆలయ కమిటీ కూడా ఏర్పాటైందన్నారు.
మంత్రి సురేఖ తో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర అభివృద్ధికి రూ.10 కోట్లు కావాలని అన్నారు. జాతర అభివృద్ధి కి శాశ్వతంగా ఉండేలా స్నానపు గదులు, టాయిలెట్స్, తదితర పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత జాతర ను విజయవంతంగా నిర్వహించిన విధంగానే ఈ జాతరను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, తాగునీటి సరఫరా లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేసే దగ్గర నీడ ఉండే విధంగా షెడ్స్ సిద్ధం చేయాలన్నారు. జాతర లో ప్లాస్టిక్ నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా దుకాణదారులకు తెలియజేయాలనీ, ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను విక్రయించినట్లయితే జరిమానా విధించాలన్నారు. జాతర లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు, నిఘాను ఉంచాలన్నారు.
వరంగల్ మేయర్ సుధారాణి మాట్లాడుతూ మేడారం తరువాత జరిగే పెద్ద జాతర ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర అని, జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఫాగింగ్ మిషన్ జాతర లో ఏర్పాటు చేస్తామన్నారు. చెత్త తరలింపునకు సంబంధించి డంపర్ బిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. కార్పొరేషన్ పరంగా అన్నివిధాలా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రతి సారి ఏవిధంగానైతే విజయవంతంగా నిర్వహిస్తున్నారో ఈ జాతర ను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్  ప్రావిణ్య మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తరలింపు లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఎక్కడ కూడా సమస్య లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున జాతర కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని, పారిశుద్ధ్య నిర్వహణ కు సిబ్బందిని కేటాయిస్తామని, చెత్త తరలింపు కోసం స్వచ్ఛ ఆటోలను సిద్ధంగా ఉంచుతామన్నారు. కుడా తరపున కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ జాతర కు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలన్నారు. మున్సిపల్ శాఖ అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. జాతరకు భక్తులు ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. కుడా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్తు లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు.


ఈ సమావేశంలో కూడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు కావలసిన ఏర్పాట్లను కుడా ఆధ్వర్యంలో చేపడతామని, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సమర్పించినట్లయితే వాటిని సమకూర్చుతామన్నారు.ఈ సమీక్షా సమావేశంలో పోలీసు, వైద్య ఆరోగ్య, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, ఆర్టీసీ, ఆర్ అండ్ బి, కుడా, సంక్షేమ, విద్యుత్తు, తదితర శాఖల అధికారులు ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల గురించి వివరించారు.జాతర కు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే నాగరాజు, మేయర్ సుధారాణి,టెస్కాబ్ రాష్ట్ర ఛైర్మన్ రవీందర్ రావు, కలెక్టర్ ప్రావిణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీసీపీ రవీందర్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఏసీపీ తిరుపతి, ఐనవోలు దేవస్థాన ఈవో నాగేశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Most Popular