Tuesday, November 12, 2024

E-Paper

Homeలేటెస్ట్తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

తిరుమల చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారి రక్షిత మృతి చెందడం బాధాకరమన్నారు. చిరుత దాడి నేపథ్యంలో తిరుమల జేఈవో కార్యాలయంలో అటవీశాఖ, పోలీసు అధికారులతో ఈవో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలిపిరిలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం సుమారు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.

సాయంత్రం 6 తర్వాత కాలినడక బాటల మూసివేత

“సీసీ కెమెరాల ద్వారా చూస్తే కాలినడక మార్గంలో చిరుత దాడి ఘటన జరగలేదు. కాలినడక నుంచి చిన్నారి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా? అనే కోణంలో విచారణ చేపట్టాం. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశాం. అలాగే రెండు కాలినడక బాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నాం. తితిదే ఛైర్మన్, అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ప్రతి 10 మీటర్లకు సెక్యూరిటీ గార్డును నియమిస్తాం. అయినప్పటికీ కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని ఈవో ధర్మారెడ్డి సూచించారు.

Most Popular