Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్డిసెంబర్‌లోనే డీఎస్సీ... ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహణ?

డిసెంబర్‌లోనే డీఎస్సీ… ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహణ?

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. పరీక్షను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు.

ఒక్కో రోజు ఒక పేపర్‌కు మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి షిప్టుల వారీగా నిర్వహించాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనుండడంతో అందుకు కావాల్సిన పరీక్షా కేంద్రాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

దరఖాస్తులు భారీగా వస్తే దానికనుగుణంగా పరీక్షా కేంద్రాలను జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పేపర్‌ తయారి, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎస్‌సీఈఆర్టీకి అప్పగించనున్నారు.

ఈక్రమంలోనే దరఖాస్తుల స్వీకరణ, విద్యార్హతలు, పరీక్ష తేదీ, సిలబస్‌, రోస్టర్‌ పాయింట్‌, అభ్యర్థుల స్థానికత, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, లోకల్‌, ఓపెన్‌ కోటా తదితర అంశాలపై అధికారులు కొన్ని రోజులుగా భేటీ అవుతూ కసరత్తులు చేస్తూవస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నేడు లేదా రేపు డీఎస్సీ మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయనుంది.

మొన్న జరిగిన గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌,సీబీటీ,పద్ధతిలో గురుకుల బోర్డు అధికారులు రోజుకు మూడు షిప్టుల్లో విజయవంతంగా నిర్వహించారు.

డీఎస్సీని సైతం కూడా ఇదే తరహాలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు టీఎస్‌ ఆన్‌లైన్‌ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో మాదిరిగానే ఎస్జీటీ అభ్యర్థులకు ఒక రోజు, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ పడడంతో ఎలాంటి కోర్టు చిక్కులు, లీకులు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 6612 పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే సర్కారు జీవోలు కూడా జారి చేసింది.

అయితే 2017లో 8972 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ టీఆర్టీ, ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఈసారి మాత్రం పాఠశాల విద్యకే నియామక బాధ్యతలను అప్పగించారు.

డిసెంబర్‌ 15వ తేదీలోపు డీఎస్సీని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎడ్‌ వారు మాత్రమే అర్హులుగా తేలుస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Most Popular