Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్ఇయ్యాల్టి నుంచి శ్రావణం..లగ్గాలు షురూ కానున్నాయి.

ఇయ్యాల్టి నుంచి శ్రావణం..లగ్గాలు షురూ కానున్నాయి.

ఈ సంవత్సరం జూన్ 30 నుంచి ముహూర్తాలు లేకపోవడంతో 45 రోజులుగా పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుండడంతో మళ్లీ లగ్గాలు, ఫంక్షన్లు మొదలు కానున్నాయి. ”ఏటా ఆషాఢం తర్వాత శ్రావణం మొదలవుతుంది. అయితే ఈసారి అధిక శ్రావణమాసం వచ్చింది. గురువారం నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఇక నెల రోజుల పాటు లగ్గాలకు మంచి రోజులు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో వేల సంఖ్యలో లగ్గాలు జరగనున్నాయి’ అని పురోహితులు చెప్పారు. వచ్చే నెల 2న మంచి ముహూర్తం ఉందని, ఆ రోజు పెద్ద సంఖ్యలో పెండ్లిలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 19, 20, 22, 24, 26, 29, 30, 31, వచ్చే నెల 1, 2, 3, 6, 7, 8 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వందల కోట్ల వ్యాపారం.. లక్షలాది మందికి ఉపాధి

లగ్గాలకు మంచి రోజులు రావడంతో వ్యాపారాలు కూడా ఊపందుకోనున్నాయి. ఏటా పెండ్లిల సీజన్ లో రాష్ర్టంలో వందల కోట్ల బిజినెస్ జరుగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే బంగారం, బట్టల దుకాణాల్లో సందడి మొదలైంది. మరోవైపు ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ అయిపోయాయి. ఒకే రోజు రెండు, మూడు ఫంక్షన్లు కూడా నిర్వహించేలా బుకింగ్స్ వచ్చాయి. గత 45 రోజులుగా ఖాళీగా ఉండడం, ఇప్పుడు ముహుర్తాలు అధికంగా ఉండడంతో నిర్వాహకులు రెంట్ భారీగా పెంచారు. చిన్న ఫంక్షన్ హాల్ కు రూ.5 లక్షలు వసూలు చేస్తుండగా.. పెద్ద ఫంక్షన్ హాల్స్, రిసార్ట్స్ లో అయితే రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఫొటోగ్రాఫర్లు, డెకరేషన్, క్యాటరింగ్ ఇలా వివిధ డిపార్ట్ మెంట్ల వాళ్లకు ఫుల్ గిరాకీ ఉంది. ఫొటోగ్రాఫర్లు ఒక్క పెండ్లికి రూ.3 లక్షలు, డెకరేషన్ వాళ్లు రూ.3 లక్షలు వరకు తీసుకుంటున్నారు. ఇక క్యాటరింగ్ నాన్ వెజ్ ప్లేట్ రూ.550 నుంచి రూ.1,200, వెజ్ అయితే రూ.200 నుంచి రూ.400 వరకు చార్జ్ చేస్తున్నారు. కాగా, లగ్గాలు, ఇతర ఫంక్షన్లతో కోట్లల్లో బిజినెస్ జరగడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, డెకరేషన్, ట్రావెల్స్, ప్రింటింగ్ ప్రెస్.. ఇలా వివిధ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి పని దొరుకుతుంది.

పెద్ద సంఖ్యలో పెండ్లిలు..

45 రోజులుగా మంచి రోజులు లేవు. గురువారం నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 14 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెండ్లిలు, గృహ ప్రవేశాలు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. శ్రావణం ముగిసిన తర్వాత భాద్రపదం ప్రారంభమవుతుంది. అప్పుడు దసరా, దీపావళి ముందు తక్కువ ముహూర్తాలు ఉంటాయి. నవంబర్, డిసెంబర్ లో కొన్ని మంచి రోజులు ఉన్నాయి.!

Most Popular