Friday, November 29, 2024

E-Paper

Homeతెలంగాణఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలి - రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్...

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలి – రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

హనుమకొండ, ఆయుధం: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో భూ, అట్రాసిటీ సమస్యలపై రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాలులో దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలను చల్లి అంజలి ఘటించారు. సమావేశానికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను డిసిపిలు రవీందర్, సలీమా, ఏసీపీలు తిరుమల్, దేవేందర్ రెడ్డి, తిరుపతి, కిషోర్ కుమార్, కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల గురించిన వివరాలను కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. భూ సమస్యలు, అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ఛైర్మన్ ను కోరారు. ఈ సందర్భంగా భూ వివాదాలకు సంబంధించిన కేసులు, అట్రాసిటీ కేసుల పరిష్కారం ఎన్ని రోజుల్లో జరుగుతుందని హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, పోలీస్ అధికారులను ఛైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎంతమంది బాధితులకు పరిహారం అందిందని వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. హసన్ పర్తి మండలం మునిపల్లి లో దళితుల భూమి సమస్యకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక ను తమకు అందజేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే తప్పకుండా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు సూచించారు. గ్రామాలలో నిర్వహించే సివిల్ రైట్స్ డే కు అన్ని కులాలు హాజరయ్యేలా అధికారులు చూడాలన్నారు. సివిల్ రైట్స్ డే నిర్వహణ కు సంబంధించి సంవత్సర కాలానికి తహసీల్దార్, ఎస్సై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సివిల్ రైట్స్ డే అవగాహన కార్యక్రమాల్లో భాగంగా భూ సమస్యలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సివిల్ రైట్స్ డే ను నిర్వహించకపోతే చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల బాధితులకు పరిహారం అందే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. భూముల సమస్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలన్నారు. బాధిత ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అందరికీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ లో నెలకొన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మెస్ చార్జీలు పెంచినందుకు ముఖ్యమంత్రికు ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ కేసులు పెండింగ్ లో ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 18వ తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధ కమిషన్ అని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ ఎస్టీల సమస్యలను పోలీసులు ఓపికగా వినాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహపూర్వక పోలీసింగ్ ను అమలు చేస్తున్నారని అన్నారు. అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కేసు తీవ్రతను బట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలతోనే ఎస్సి, ఎస్టి లకు సంబంధించిన భూ వివాద సమస్యలు, అట్రాసిటీ కేసులకు పరిష్కారం లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలో నమోదైన మొత్తం 21 కేసులపై తహసీల్దారుల నుండి ప్రాథమిక నివేదికలు అందాయని, వాటిపై 15 రోజులలో సమగ్ర నివేదికను కమిషన్ కు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నునావత్ రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, జవహర్ లాల్ నాయక్, చుంచు రాజేందర్, రడపాక పరంజ్యోతి, సింగారపు రవి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

 

Most Popular