Friday, November 8, 2024

E-Paper

Homeతెలంగాణమత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి

(ఆయుధం హన్మకొండ) హనుమకొండ : రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుండి వంద శాతం సబ్సిడీపై వచ్చిన చేపపిల్లలను వడ్డేపల్లి చెరువులో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాయితీ చేప పిల్లలను అధికారులు, మత్స్యకారుల సమక్షంలో చెరువులోకి విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 700 పైగా చెరువులు ఉండేవని, ఈసారి 811 చెరువులలో ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను విడుదల చేస్తుందన్నారు. వడ్డేపల్లి సహా హనుమకొండ లోని నాలుగు చెరువులలో నాలుగున్నర లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొదటి విడతగా 50% చేప పిల్లలు ప్రభుత్వం నుండి రాయితీగా వచ్చాయని, మిగతా 50 శాతం అక్టోబర్ నెలలోనే పూర్తిస్థాయిలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. మత్స్యకారులకు ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం వర్తింపజేస్తుందన్నారు. చెరువులు, కుంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చాలావరకు చెరువులు కబ్జాకు గురైన విషయం అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ప్రజలు సహకరిస్తేనే చెరువులు, కుంటలు కబ్జా కాకుండా కాపాడుకోగలుగుతామని అన్నారు. ప్రజలు సహకరిస్తే భవిష్యత్ తరాలకు అందించిన వారమవుతామన్నారు. మత్స్యకార సంఘాలు కూడా చెరువులు, కుంటలు కబ్జా కాకుండా చూడాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా ప్రతి ఒక్క పౌరునిపై బాధ్యత ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. కాకతీయుల కాలం నుండి వరంగల్ లో గొలుసు కట్టు చెరువులకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారిపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అదనపు సంచాలకులు శంకర్ రాథోడ్, జిల్లా మత్స్య సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ మల్లేశం, జిల్లా మత్స్య అధికారి నాగమణి, మత్స్య సహకార సంఘం ప్రతినిధులు , స్థానిక మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Most Popular