Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణహనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

హనుమకొండ: సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సిద్దిపేట- ఎల్కతుర్తి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై జాతీయ రహదారుల శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు 63.64 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఉండగా హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్న 17.5 కిలోమీటర్ల లో ఇప్పటివరకు 16.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయిందని జాతీయ రహదారుల శాఖ అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. ఎల్కతుర్తి, ముల్కనూర్ పరిధిలో ఒక్క కిలోమీటర్ దూరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. జిల్లా పరిధిలో ఉన్న ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొత్తం మే నాటికి పూర్తవుతాయని అధికారులు తెలుపగా ఏప్రిల్ 30 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రహదారి వెంట ఇరువైపులా మొక్కలను నాటడంతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జాతీయ రహదారుల శాఖ డీఈఈ మనోహర్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్ జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Most Popular