రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం హైదరాబాద్ పరిధిలో హైడ్రాను ఏర్పాటు చేసిన తరహాలోనే జిల్లాల్లో కూడా ఒక విధానం ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని ప్రకటించారు. ఆక్రమణ దారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా వాటిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.చెరువుల ఆక్రమణలపై రాష్ట్రం మొత్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడుతాం. ప్రజా ప్రతినిధులు, సమాజంలో బాగా ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవారైనా కావొచ్చు. ఏ ఒత్తిడి వచ్చినా ఈ ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలకు సంబంధించి ఆక్రమణలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు ఉంటాయి” అని చెప్పారు.