ఆయుధం న్యూస్ హనుమకొండ:
తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా హనుమకొండలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం – విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాజ్‌పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనానికి, అలాగే టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని, టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.ఈ అభివృద్ధి పనుల ద్వారా హనుమకొండ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు, వోల్టేజ్ సమస్యలు తగ్గి, విద్యుత్ అంతరాయాలు నివారించబడతాయి. వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణను విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం, పరిశ్రమలు, వాణిజ్య రంగం, గృహ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా, మౌలిక వసతుల విస్తరణ, సబ్‌స్టేషన్ల నిర్మాణం, వినియోగదారులకు మెరుగైన సేవలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు విద్యుత్ రంగాన్ని మరింత ఆధునికీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) నిఖిల, టీజీఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
