అమరావతి: రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు రోజులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, లలన్ సింగ్ , శివరాజ్ సింగ్ చౌహన్ లతో విస్తృతంగా చర్చలు జరిపామని, రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయని వెల్లడించారు. ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, అదనపు ఆర్థిక సాయం, ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.గత ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈసారి టొబాకో బోర్డు అనుమతించిన 1.44 మిలియన్ కిలోల ఉత్పత్తికి దాదాపు రెట్టింపు స్థాయిలో సాగు చేశారని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ముడి పొగాకుపై జీఎస్టీ 27 శాతం నుంచి 40 శాతానికి పెరగడం వంటి పరిణామాలు రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని వివరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారని చెప్పారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తో సమావేశమై పొగాకు రైతుల సమస్యలను వివరించామని, ముడి పొగాకుపై జీఎస్టీని తగ్గించాలని కోరామని, ఆ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా టొబాకో బోర్డు వద్ద రైతుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.750 కోట్ల సెస్ నిధుల నుంచి కిలోకు రూ.15 చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోళ్లపై ఐటీసీ సహా ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో మాట్లాడి రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా, అందరూ సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ ధరలు తగ్గించే దిశగా కూడా కేంద్రంతో చర్చలు జరిపామని, ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్‌లో దేశీయ అవసరాలకు కనీసం 50 శాతం నిల్వ ఉంచి మిగిలిన పరిమాణాన్ని మాత్రమే ఎగుమతి చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. తోతాపురి మామిడి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కిలోకు రూ.4 ప్రోత్సాహక సాయం అందించి రైతులను ఆదుకుందని, ఇదే ప్రభుత్వ స్పందనకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
