ఆయుధం న్యూస్ హన్మకొండ
పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పేదల పక్షపాతిగా పనిచేస్తోందని తెలిపారు.
సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో రూ.3.25 కోట్లతో నిర్మించిన కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, పేద కుటుంబాల పిల్లలు కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం విద్యారంగంపై భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలను 40 శాతం, పేదింటి ఆడపిల్లలు వసతి గృహాల్లో చదువుకునేందుకు అవసరమైన కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, పుస్తకాలు, ఇతర సామగ్రిని విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల్లోపే నాణ్యమైన మెటీరియల్‌తో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున కేటాయించి, సుమారు 3,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను నిర్మిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పేద పిల్లలకు మంచి విద్యను అందిస్తే వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా, మరో పది మందికి, వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని మంత్రి అన్నారు. గతంలో పేదలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాల వద్ద పెద్దఎత్తున భూములు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చెబుతున్నారని పేర్కొన్నారు. అందుకే పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడానికి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
విద్య, వైద్యం పేదల జీవితాలకు రెండు కళ్ల వంటివని, ఈ రెండు రంగాలను బలోపేతం చేసి పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.కేజీబీవీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి వెంటనే స్పందించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రిల్స్, ప్రహరీ తదితర అవసరమైన పనులను టాప్ ప్రాధాన్యతతో చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా ప్రభుత్వం : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ: రాష్ట్ర విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో విద్యాబోధనపై పూర్తి దృష్టి సారించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.నాణ్యమైన విద్యే భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాది అని పేర్కొంటూ, పెరుగుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాలు, వృత్తి పరమైన సామర్థ్యాలను పెంపొందించుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్య పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థికి మెరుగైన ఉపాధి, భవిష్యత్ అవకాశాలు లభించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణ కార్యక్రమం పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. నాబార్డు నిధులతో అదనపు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని కేజీబీవీలను జూనియర్ కళాశాలల స్థాయికి అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, అన్ని జూనియర్ కళాశాలల్లో అదనపు తరగతి గదులు, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు.విద్యార్థులకు నూతన యూనిఫాంలతో పాటు ట్రంక్ బాక్సులు, ఇతర అవసరమైన సామగ్రిని అన్ని పాఠశాలలకు ఇప్పటికే అందజేశామని తెలిపారు. కేజీబీవీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అన్న అంశంపై ఏపీసీలు, కోఆర్డినేటర్లు, డీఈఓ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రులు విద్యార్థినులకు బ్లాంకెట్లు, ట్రంక్ బాక్సులు, కార్పెట్లు, ఇతర అవసరమైన సామగ్రిని స్వయంగా అందజేశారు. నూతన భవనంలో విద్యార్థినులకు అందుబాటులోకి వచ్చిన వసతులను పరిశీలించి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఘనంగా సన్మానించి, అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, ఇదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ప్రిన్సిపాల్ అనితాదేవి , వివిధ శాఖల అధికారులు, కేజీబీవీ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
