ePaper
Sunday, September 27, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేదల సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, పేదల కష్టాలు, బాధలు తీర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను చేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.సొంతిల్లు అనేది ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి అన్నారు. గతంలో వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఇల్లు ఎవరు నిర్మించారన్నది కాకుండా, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లను, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లను, ఇప్పటివరకు హైద్రాబాద్ తో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను మంజూరు చేసేనట్లు మంత్రి తెలిపారు. అనంతరం మూడో, నాలుగో దశల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించే వరకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపడం లేదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం, మంత్రుల నియోజకవర్గాలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా అర్హత ఆధారంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదోడు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీకి చెందినవాడన్నది కాకుండా, అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి విడత నిధులను విడుదల చేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
ఇళ్ల నిర్మాణంతో పాటు లబ్ధిదారుల కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో పేదలకు పరిమిత సంఖ్యలో ఇళ్లు అందించిన పరిస్థితికి భిన్నంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దశలవారీగా సుమారు 8 లక్షల ఇళ్లను మంజూరు చేసి పేదలకు అందించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాబోయే దశల్లోనూ అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. పేదల ముఖాల్లో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందుకుంటున్న లబ్ధిదారులందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ:
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న సూచనలు, విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రాంత సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న లబ్ధిదారులందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ
కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్ మండలం, గూడూరు గ్రామంలో 50, మనేపల్లి గ్రామంలో కలిపి మొత్తం 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా వారి సొంతింటి కల సాకారమవుతోందన్నారు. లబ్ధిదారులు ఇళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని మంత్రులను ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ
కమలాపూర్ మండలంలో మొత్తం 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల ద్వారా ధ్రువీకరించి ఎంపిక చేశామని తెలిపారు. తప్పుడు సమాచారం ద్వారా అనర్హులు ఎంపికైనట్లు తేలితే కేటాయింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు వారం రోజుల్లోగా ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఇళ్లకు తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతులను త్వరితగతిన కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
అంతకుముందు కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులతో మంత్రులు గృహప్రవేశం చేయించారు. అనంతరం ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులకు కల్పించిన వసతులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, , హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!