ఆయుధం న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ లే అవుట్, నిర్మాణ డిజైన్లను త్వరగా సిద్ధం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న పరకాల ఇందిరా మహిళా డెయిరీ లేఅవుట్, డిజైన్ పై హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా డెయిరీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాల పురోగతిపై ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా దామెరలో ఏర్పాటు చేస్తున్న డెయిరీ ప్లాంట్ యొక్క సివిల్ వర్క్స్, లేఅవుట్ ప్లాన్ , బీఎంసీయూల కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాల డెయిరీ భవన నిర్మాణ డిజైన్ లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. డెయిరీ ప్లాంట్ నిర్మాణ పనులకు అవసరమైన డిజైన్లను త్వరగా సిద్ధం చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా సంగెం మండలంలో ఏర్పాటు చేయనున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీయూ )కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయి కమిటీ ద్వారా తుది నిర్ణయం తీసుకున్న సంస్థల నుంచి వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ మేన శ్రీను, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్ రావు, ఆరిజిన్ కన్సల్టెంట్ ప్రతినిధి వైవియన్ రెడ్డి, అదనపు డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, డిపిఎం సరిత ఏపీఎం దివాకర్ రాయి పరకాల ఇందిరా మహిళా డెయిరీ మేనేజర్లు కృష్ణ, సృజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
