ఆయుధం న్యూస్ హైదరాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు, అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద బతుకమ్మ ఘాట్ల వద్ద శుభ్రత, మట్టి పనులు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. ఏర్పాట్ల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
