ఆయుధం న్యూస్ హనుమకొండ:
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థినులు ఉత్తమ విద్యా ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని, సులభంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు.గురువారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అందిస్తున్న మైసూర్ బోండాను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ప్రతిరోజూ అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం నాణ్యత, రుచి, మెనూ గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, ఆర్వో వాటర్ ప్లాంట్ పనితీరును తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే ఆహారం పరిశుభ్రంగా, పోషకాహార ప్రమాణాలతో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం
ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సుల విద్యార్థినులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో నేరుగా మాట్లాడారు. ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు ఫిజిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను బోర్డుపై రాసి వాటిపై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి, చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థినికి సులభంగా అర్థమయ్యే విధంగా అధ్యాపకులు పాఠ్యాంశాలను బోధించాలని సూచించారు. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఫిజిక్స్ వాలా తరగతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే నీట్, జేఈఈ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అజ్మీర గోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
