ePaper
Friday, July 17, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు.

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు.

📰 Generate e-Paper Clip

గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి కి అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్ర‌భ‌క‌ర్ తో కలిసి మంత్రి సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరగోల చేతిలో ధరించి, వారిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాడ బోనాల ఉత్సవాల బుక్ లెట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల చెక్కును ఇరువురు మంత్రులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల సమర్పణతో ఎల్ నినో ప్రభావం తగ్గి, భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి సురేఖ గారు ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రథమ ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద దేవాలయాతో పాటు, చిన్న చిన్న దేవాలయాలకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆషాడ బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సంతోషంగా అమ్మవార్లను దర్శించుకుని వెళ్ళేలా సకల ఏర్పాట్లను చేసినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!