ఆయుధ న్యస్ ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ని కోరారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను ఖర్చు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతోందని కేంద్ర మంత్రి గారికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్,వేంనరేందర్ రెడ్డి,డాక్టర్ మల్లు రవి,రామసహాయం రఘురాంరెడ్డి,పోరిక బలరాం నాయక్,గడ్డం వంశీకృష్ణ,కడియం కావ్య,ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి , నీటి పారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్ ,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
