ఆయుధం న్యూస్ స్టేషన్ ఘనపూర్
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ కుడి కాలువను నీటిపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎస్సి కాలనీ నుండి వెళ్తున్న పంట కాలువను, తూము వద్ద కాలువను, పలు కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్బంగా పంట కాలువలో మురుగు నీరు చేరడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మురుగు నీరు పంట కాలువలో చేరకుండా చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పంటల కాలువకు రెండు వైపులా సైడ్ వాల్స్ నిర్మాణం చేసి చివరి వరకు సాగు నీరు వెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం రెండు మూడు రోజులలో సాగు నీరు అందించేందుకు వెంటనే కాలువలో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. 3 నెలలలో శాశ్వత కెనాల్ నిర్మాణానికిసంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వెల్లడించారు. మున్సిపాలిటీ డ్రైనేజి నీరు పంట కాలువలలో చేరకుండా మున్సిపల్ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో డ్రైనేజిలు, వరద కాలువలు, పంట కాలువల నిర్మాణం చేయాలని ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసిల సామర్థ్యంతో ఘనపూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఘనపూర్ రిజర్వాయర్ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉందని కానీ కెనాల్స్ ఆధునికరించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో సాగు నీరు అందడం లేదని తెలిపారు. రిజర్వాయర్ కింద ఉన్న 2,500 ఎకరాలకు సాగు నీరు అందాలంటే చివరి వరకు కెనాల్స్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు సంబందించిన ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
మున్సిపాలిటీకి సంబందించిన మురుగు నీరు పంట కాలువలలోకి రాకుండా డ్రైనేజిల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే కొన్ని డ్రైనేజీలు, వరద కాలువలకు టెండర్లు పూర్తి అయ్యాయని ఇంకా ఎక్కడెక్కడ డ్రైనేజి నీరు పంట కాలువలలో కలుస్తుందో అక్కడ డ్రైనేజిల రీడిజైన్ చేయాలని తెలిపారు. అందుకు మున్సిపాలిటీ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. వరద నీరు, మురుగు నీరు పంట కాలువలో కలవకుండా వాగులో కలిసే విధంగా డ్రైనేజిల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పంటలకు సాగు నీరు ఇచ్చేందుకు వెంటనే పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేసి మూడు రోజులలో పంటలకు సాగు నీరు అందించాలని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలం వరకు పూర్తి స్థాయిలో కెనాల్స్ నిర్మాణం చేసి ఘనపూర్ రిజర్వాయర్ ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డయని అన్నారు. దింతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతూ, అధికారులను సమన్వయం చేస్తూ రైతులకు సాగు నీరు అందెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, అశ్వరావుపల్లి, గండి రామారం, నవాబ్ పేట రిజర్వాయర్లలో నీటి నిలువలు పెంచి అందుబాటులో ఉన్న నీటితో సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఆగస్టు 14న నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్ల నుండి రైతులకు సాగు నీరు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 14నుండి 15రోజుల పాటు నీటి విడుదల జరుగుతుందని మరో 15రోజుల పాటు మళ్ళీ రిజర్వాయర్లలో నీటిని నింపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిరంతరాయంగా నీటి విడుదల సాధ్యం కాదని అందుకని ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో సాగు నీటి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి సహకరిస్తూ కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, నీటి పారుదల శాఖ ఎస్ఈ సీతారాం, ఈఈలు, డిఈలు, మున్సిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
