ఆయుధం న్యూస్ గ్రేటర్ వరంగల్ :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న తెలిపారు.
శుక్రవారం కమిషనర్ హన్మకొండ నగర పరిధిలోని హసన్‌పర్తి చెరువు, భీమారం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి బతుకమ్మ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ, పండుగకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా పండుగలో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, విద్యుత్ దీపాలు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలు పూర్తయిన వెంటనే చెరువుల పరిసరాలను శుభ్రం చేయాలని, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబం. ఆడపడుచుల ఆనందమే పండుగకు అసలైన శోభ. మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకునేలా, నగరంలో పండుగ వాతావరణం వెల్లివిరిసేలా జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.ఈ పర్యటనలో సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
