ఆయుధం న్యూస్ హన్మకొండ
టిబీ రహిత సమాజానికి కృషి చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధనా పట్నాయక్ అన్నారు.శుక్రవారం న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎన్సీసీ అధికారులతో దేశవ్యాప్తంగా టీబీ నిర్మూలనపై చేపట్టే కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ అదనపు కార్యదర్శి ఆరాధన పట్నాయక్ మాట్లాడుతూజిల్లాలో క్షయవ్యాధి (టిబీ) నిర్మూలనకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టి, టిబీ రహిత గ్రామాల సంఖ్యను పెంచాలన్నారు. టిబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేస్తూ క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో దీర్ఘకాలిక దగ్గు, తదితర టిబీ లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వెంటనే సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి మండలంలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో జోష్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజల్లో టిబీ లక్షణాలున్న వారిని గుర్తించే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తెలిపారు. ఈ బృందాల్లో ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, యువ క్రీడాకారులు , మై భారత్ వాలంటీర్లను భాగస్వాములను చేసి ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.టిబీ బాధితులకు పౌష్టికాహారం అందించడం కూడా వ్యాధి నియంత్రణలో కీలకమని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు, వివిధ సంస్థల సహకారంతో టిబీ బాధితులకు పోషకాహార కిట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 25 గ్రామాలు టిబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, బాధితులకు పూర్తిస్థాయి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ నెలలోనే మరికొన్ని గ్రామాలను టిబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, ఎన్సిసి అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
