నా పరిధి, అధికారాలు నాకు తెలుసు.. అవి అతిక్రమించలేదు
ఎమ్మెల్యేగా అధికారులను కలిసే హక్కు ఉంది..
అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.. కాంట్రావర్సీల కోసం కాదు
మంత్రి సురేఖ లేఖపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆయుధం న్యూస్ హన్మకొండ
దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాసిన లేఖపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ”అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.. కాంట్రావర్సీల కోసం కాదు.. ఒక ఎమ్మెల్యేగా, ప్రజా ప్రతినిధిగా ఏ అధికారినైనా కలిసే హక్కు నాకు ఉంది, నా నియోజకవర్గ సమస్యలు తెలపడం ఒక ఎమ్మెల్యేగా నా హక్కు. నాకు రూల్స్ తెలుసు.. నేను ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదు.” అని కడియం పేర్కొన్నారు. ”బిజినెస్ రూల్స్, రాజ్యాంగ ప్రకారం.. క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నవారు మాత్రమే సమీక్ష చేస్తారు.. ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు సమీక్షలో పాల్గొంటారు.” అని గుర్తు చేశారు. అయితే నా నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై సంబంధిత శాఖ కార్యాలయానికి వెళ్లి దేవాదాయ శాఖ కమిషనర్ ని కలిసానని కడియం తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి పలు వినతి పత్రాలు అందజేశానని అన్నారు. తాను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొందరు అవగాహనా లోపంతో మాట్లాడుతున్నారని.. నా అధికారాలు, పరిమితులు ఏంటో నాకు తెలుసు. అని కడియం పేర్కొన్నారు. తనపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు.
– ఉమ్మడి జిల్లాను పట్టించుకునే వారేరి?
అభివృద్ధి గురించి ఆలోచించని వారు, ప్రజల మధ్యలో ఉండని వారు కాంట్రావర్సీలు సృష్టించి వార్తల్లో ఉండాలని చూస్తారని కడియం దుయ్యబట్టారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాను పట్టించుకునే వారే లేకుండా అయ్యారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల పై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎవరిదని.? ఎంజీఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ లేడు.. దానిని ఎవరూ పట్టించుకోవాలని ప్రశ్నించారు. సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయాలి దాన్ని పట్టించుకునే వారే లేరని తెలిపారు. వరంగల్ మహా నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి టెండర్లు పూర్తి చేయించి పనులు ప్రాంభించడానికి చొరవ తీసుకోవాల్సింది ఎవరని ప్రశ్నించారు. అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని.. కాంట్రావర్సీల కోసం కాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
