ఆయుధం న్యూస్ హైదరాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ పురోగతి, ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్, వాటి అనుబంధ సంస్థల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతికత వినియోగం, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవల విస్తరణ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందిచడం మొదలైన అంశాల పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి వారి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతి, ఎంజిఎం హాస్పిటల్, సికెఎం ప్రభుత్వ మెటర్నిటి హాస్పిటల్, ప్రభుత్వ ఆయుర్వేదిక్ టీచింగ్ హాస్పిటల్, నర్సంపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రాంతీయ కంటి హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీ తదితర ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య సంస్థలు, వాటి అనుబంధ కార్యాలయాల అభివృద్ధి పనులు, సిబ్బంది భర్తీ, వీటికి సంబంధించి ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనల పై తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించడం జరిగింది.

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగం, డయాలసిస్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు అమర్చడంతో పాటు అవసరమైన సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనులను త్వరితగిన పూర్తి చేసి ఎంజిఎం హాస్పిటల్ పై ఒత్తిడిని తగ్గించాలని మంత్రులు అధికారులకు సూచించారు.వరంగల్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తికావడంతో, ఆధునిక పరికరాల అమరిక, ల్యాండ్‌స్కేపింగ్, హాస్పిటల్ అంతర్గత రహదారుల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూను మంత్రులు ఆదేశించారు
