ఆయుధం న్యూస్ హన్మకొండ
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్ పాయి అన్నారు. యువత, విద్యార్థులు, ప్రజల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణ నుంచి హనుమకొండ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయి జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మాదకద్రవ్యాల లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తి, ప్రతిభను విద్య, క్రీడలు, సామాజిక సేవ, దేశ నిర్మాణం వంటి సానుకూల కార్యక్రమాల వైపు మళ్లించాలని సూచించారు.ర్యాలీలో పాల్గొన్న రెడ్‌క్రాస్ పాలకవర్గ సభ్యులు, విద్యార్థులు “మాదకద్రవ్యాలకు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి”, “డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.మాదకద్రవ్యాల అలవాటు వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, డాక్టర్ సి.హెచ్. సంధ్యారాణి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, డాక్టర్ గొట్టిముక్కల శ్రీలక్ష్మి, పొన్నాల సంయుక్త, రెడ్‌క్రాస్ సిబ్బంది, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
