ఆయుధం న్యూస్ ములుగు.
రైతులకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చిందని ములుగు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవాలని,ఇప్పటికే పలువురు రైతులు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం తెలియని రైతులు తమ సమీప మీసేవ కేంద్రాన్ని సందర్శించి సులభంగా యూరియా బస్తాలను బుక్ చేసుకోవచ్చన్నారు.యూరియా బుకింగ్ కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతితో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను మీసేవ కేంద్రంలో సమర్పించాలని తెలిపారు. వివరాలను నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు యూరియా బస్తాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, బుకింగ్ పూర్తయ్యాక యూరియా బుకింగ్ ఐడీతో కూడిన రసీదును రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు.పోడు పట్టాలు కలిగిన రైతులు కూడా ఈ సేవను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సేవల అమలుపై జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు చెప్పారు.ప్రభుత్వం ఈ సేవకు 10 రూపాయలు సేవా రుసుము నిర్ణయించినందున రైతులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ సేవను వినియోగించుకోవాలని సూచించారు.
మొబైల్ నంబర్ మార్పు చేసుకోవాలనుకునే రైతులు, కౌలు రైతులు యూరియా బుకింగ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత రైతు వేదికలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ను సంప్రదించి మొబైల్ నంబర్ మార్పు, కౌలు రైతుగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. అసలు పట్టాదారు అనుమతితో కౌలు రైతులు కూడా యూరియా బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపారు. డిజిటల్ సంతకం పూర్తికాని భూములు కలిగిన పట్టాదారు రైతులు కూడా తమ ఆధార్ నంబర్ ఆధారంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
