ePaper
Friday, July 10, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండస్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు రాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులకు రాష్ట్ర గవర్నర్ ప్రశంసలు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి, మహిళల కృషిని అభినందించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA), వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించిన వివిధ ఉత్పత్తులను గవర్నర్ ఆసక్తిగా పరిశీలించారు. మహిళలు స్వయంగా తయారు చేసిన ప్రతి ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకుంటూ, వాటి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మిల్లెట్లతో (చిరుధాన్యాలు) తయారు చేసిన ఆహార ఉత్పత్తులు, చేతితో నేసిన వస్త్రాలు, స్వచ్ఛమైన నెయ్యి, వంట నూనెలు, ఇతర విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసించారు. మహిళల శ్రమకు ప్రోత్సాహంగా పలు ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. అలాగే ప్రసిద్ధ వరంగల్ దరీ స్టాల్‌ను సందర్శించి, దరీల ప్రత్యేకత, తయారీ ప్రక్రియ, వాటి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దరీ ఉత్పత్తుల నాణ్యతను కొనియాడుతూ వాటిని కూడా కొనుగోలు చేసి మహిళా కళాకారులను ప్రోత్సహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారవుతున్న నాణ్యమైన ఉత్పత్తులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని, ఇలాంటి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని గవర్నర్ అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, గవర్నర్ కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సిపి శ్వేతా జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!