ఆయుధం న్యూస్ వనపర్తి
తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ ప్రభుత్వరంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ గారితో కలిసి వనపర్తి జిల్లా కొత్తకోట నియోజకవర్గంలో “మైనారిటీ తుర్క కాషా కమ్యూనిటీ పునరావాస పథకం” కింద తుర్క కాషా ముస్లిం సమాజానికి జనరేటర్లు మరియు టూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సమానత్వ భావనతో ప్రతి పౌరుడిని ఆదరిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చేతులతో రాళ్లు కొట్టడం చాలా కష్టమైన పని. ప్రతిరోజూ మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఈ జనరేటర్లు, యంత్రాల సహాయంతో మీ పని సులభంగా, వేగంగా జరుగుతుంది. శారీరక శ్రమ తగ్గి, మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ పరికరాలు మీ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయని మంత్రి పేర్కొన్నారు. తుర్క కాషా సమాజంతో పాటు ఇతర మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.పేదలు, కార్మికులు, మైనారిటీలు సహా ప్రతి వర్గం అభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తకోటకు రావడం, లబ్ధిదారులను కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ, తుర్క కాషా సమాజ అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జీవనోపాధి మెరుగుపడి, వారి జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ చైర్మన్, సీడీసీ చైర్మన్, కౌన్సిలర్లు, టీజీఎంఎఫ్‌సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, మహబూబ్‌నగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మరియు టీజీఎంఎఫ్‌సీ అధికారులు పాల్గొన్నారు.
