ఆయుధం న్యూస్ హైదరాబాద్
గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కోరారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను, ఈ ప్రాంతానికి ఉన్న రైల్వే ప్రాధాన్యతను జీఎంకు వివరించారు.
కాజీపేట జంక్షన్ దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైన జంక్షన్‌గా ఉన్నప్పటికీ, దానికి తగిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు. కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని, రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు, రైల్వే వినియోగదారులు కూడా ఈ డిమాండ్‌ను కోరుతున్నారని తెలిపారు.ఇటీవల రైల్వే జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కాజీపేట డివిజన్ అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రైల్వే జోన్, డివిజన్ల ఏర్పాటు జరుగుతున్న సమయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేస్తే పరిపాలనా సామర్థ్యం పెరగడంతో పాటు రైల్వే కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని వివరించారు.రైల్వే ఆదాయంలో కాజీపేట ప్రాంతానికి కీలకమైన వాటా ఉందని ఎంపీ తెలిపారు. బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ, కాజీపేట–కరీంనగర్, డోర్నకల్–మణుగూరు తదితర రైల్వే మార్గాలు సరుకు రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని చెప్పారు. బొగ్గు, సిమెంట్, బియ్యం, మిర్చి, గ్రానైట్, ఎరువులు తదితర సరుకుల రవాణాకు ఈ ప్రాంతంలో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌పై రైల్వే ట్రాఫిక్‌తో పాటు పరిపాలనా భారం కూడా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కాజీపేటను కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే పనిభారం సమతుల్యం అవడంతో పాటు ఈ ప్రాంత రైల్వే అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు.
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అని, దీనిపై రైల్వే శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎంపీ జీఎంను కోరారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో వరంగల్–కాజీపేట ప్రాంతంలో రైల్వే మౌలిక వసతులు, ప్రయాణికుల సౌకర్యాలు, సరుకు రవాణా మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని ఎంపీ పేర్కొన్నారు.
