ఆయుధం న్యూస్ వరంగల్
భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించినప్పుడే అనుమతులు మంజూరు చేస్తామని, అనుమతించిన నిర్మాణ ప్రణాళిక (శాంక్షన్డ్ ప్లాన్) ప్రకారమే భవనాలు నిర్మించిన వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేస్తామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు.గ్రేటర్ వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను కమిషనర్ క్షేత్రస్థాయిలోస్వయంగా బుధవారంపరిశీలించారు. హంటర్ రోడ్, ప్రకాశ్‌రెడ్డి పేట, నక్కలగుట్ట, జూలైవాడ, ఎక్సైజ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, నిర్మాణాలను పరిశీలించి, భవనాల కొలతలను వేయించారు. అనుమతించిన నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగానే భవనాలు నిర్మించారా లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో కొత్తగా భవన నిర్మాణాలు చేపట్టే యజమానులు తప్పనిసరిగా మున్సిపల్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన యజమానులు మంజూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలను పూర్తి చేసి, అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.నిర్మాణ అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.ఈ తనిఖీల్లో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ అవినాష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
