ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయురాలిగా మారిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్  హనుమకొండ : ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలవాలని, విద్యార్థుల్లో పఠన సామర్థ్యం,గణిత నైపుణ్యాలు,ఆలోచనాశక్తిని పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి ఐదో తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యాంశాన్ని  బోధించారు. ఒక చేత్తో గణిత పాఠ్యపుస్తకాన్ని కలెక్టర్ పట్టుకొని మరో చేతితో చాక్ పీస్ చేత పట్టి బ్లాక్‌బోర్డుపై స్వయంగా లెక్కలు రాసి విద్యార్థులతో గణితం లెక్కను సాధింపజేయడంతో పాటు వారి అవగాహన, ప్రతిభ, నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు.

పాఠశాల సందర్శనకు వచ్చి తరగతి గదులు పరిశీలిస్తూ వచ్చిన కలెక్టర్ ఐదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా బోధించడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. కలెక్టర్ ఉపాధ్యాయురాలుగా మారి పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన సాగించడం పాఠశాల ఉపాధ్యాయులకు సైతం స్ఫూర్తినిచ్చింది. విద్యార్థులకు గణిత పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఎంతవరకు అర్థం చేసుకున్నారనే వివరాలను  అడుగుతూ కలెక్టర్ ముందుకుసాగారు. స్వయంగా జిల్లా కలెక్టర్ గణిత పాఠ్యాంశాన్ని సులువుగా అర్థమయ్యేట్టు బోధించడంతో పాఠశాల విద్యార్థులు సంబరపడ్డారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.ఆనందంతో మాట్లాడిన కలెక్టర్ విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడం ద్వారా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థుల సంఖ్యను పెంచుకోవచ్చునని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని తెలిపారు.ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, గణితం లెక్కలు చేయడంలో నైపుణ్యం సాధించేలా ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని, విద్యార్థుల అభ్యాస ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.పాఠశాలలోని తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వారి తల్లులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న గుడ్లు, బాలామృతం పంపిణీని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు. ప్రీ-స్కూల్ విద్యా బోధనను పరిశీలించి చిన్నారుల్లో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వనమహోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని డంపింగ్ యార్డ్, గ్రామపంచాయతీ కార్యాలయంలోని నర్సరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చింతకుంటపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ సమర్ధ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  రాంభూపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, తహసీల్దార్ విక్రమ్ కుమార్ , ఎంపీడీవో నర్మద,  సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!